ఈడీ విచారణకు హాజరైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య, కుమారుడు
- లిక్కర్ స్కామ్ లో విచారణ వేగవంతం చేసిన ఈడీ
- ఈడీ అధికారులకు తమ ఆస్తుల వివరాలను అందించామన్న మోహిత్ రెడ్డి
- తమ కుటుంబం సంపాదించిన ప్రతి రూపాయి కష్టార్జితమేనని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో జరిగిన మనీలాండరింగ్ ఆరోపణలపై దృష్టి సారించిన ఈడీ... వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్యతో పాటు ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈరోజు ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
విచారణ అనంతరం మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఈడీ అధికారులు అడిగిన తమ ఆస్తుల వివరాలన్నింటినీ పూర్తిస్థాయిలో అందజేశామని, దర్యాప్తుకు తమ వంతుగా పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు. తమ కుటుంబం సంపాదించిన ప్రతి రూపాయీ కష్టార్జితమే తప్ప... అందులో ఎలాంటి అక్రమ సంపాదన లేదని స్పష్టం చేశారు. ఏపీ సిట్ కేవలం కక్షపూరితంగానే తమపై కేసులు నమోదు చేసిందని ఆయన ఆరోపించారు.
ముడుపుల సొమ్ముతో తాము ఆస్తులు కొనుగోలు చేశామనే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, ఈ కేసులను న్యాయపరంగానే ఎదుర్కొంటామని చెప్పారు. తాము సంపాదించిన ప్రతి పైసా సక్రమమైనదేనని పేర్కొన్నారు.